Batti Vikramarka: రుణమాఫీ వివరాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉంచుతాం 1 y ago
TG : బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కనీసం హాస్టళ్లలోని సమస్యలను కూడా పరిష్కరించలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాము 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించామని, వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి మొదటిసారి దళిత వీసీని నియమించామని చెప్పారు. సిరిసిల్లలో రూ. 175.85 కోట్ల రుణమాఫీ చేశామని, ఇచ్చిన మాట తప్పకుండా ఏడాదిలోనే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ వివరాలు అన్ని గ్రామాల్లో డిస్ప్లేలో పెడతామని, అవసరమైతే అసెంబ్లీ ప్రాంగణంలో కూడా వివరాలు ఉంచుతామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సిద్ధిపేట నియోజకవర్గానికి సంబంధించి కేవలం రూ.96.62 కోట్ల మాత్రమే రుణమాఫీ జరిగిందని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 177 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ప్రజల కోసం తాము పనులు చేశామని, బీఆర్ఎస్ కేవలం ప్రచారాలు మాత్రమే చేసిందని విమర్శించారు. గృహ జ్యోతికి సంబంధించి 115 నియోజకవర్గాల సమాచారం తమ వద్ద ఉందని, ఏ పథకంపైనైనా లెక్కలు చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేసి అన్ని విధాలా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు.